ads header

Saturday 9 January 2021

తాగితే మస్తు మజా.. ఔషధ గుణాల కలబోత

0


 ఇప్పటివరకు పోద్దాళ్లు.. పరుపుతాళ్లు..పండుతాళ్లు.. నాపతాళ్ల కల్లే మనకు తెలుసు.. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రాచీనకాలం నుంచీ మనుగడలో ఉండి.. ఇప్పుడిప్పుడే ఫేమస్‌ అవుతున్న గిరకతాటి కల్లు గురించి తెలుసుకుందామా..? ప్రకృతి సిద్ధ మధుపానీయంగా పేరుండి, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన 'జీలుగచెట్టు' కల్లు ఇప్పుడు, చాలా మందిని తనవైపు తిప్పుకుంటున్నది.

తాగితే మస్తు మజానిచ్చే ఈ కల్లుకు జనం ఫిదా అవుతున్నది.

- బయ్యారం , జనవరి 9

కల్లు .. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది తాగే మధుపానం. ఇప్పటివరకు తాటి కల్లు, ఈత కల్లు, కర్జూర కల్లు, వేప కల్లు.. కొబ్బరి కల్లు మాత్రమే అందరికీ తెలుసు. కానీ బయ్యారం పెద్దచెరువు సమీపంలోని లొద్దిలో సహజ సిద్ధంగా పెరిగిన జీలుగ చెట్టు (గిరక తాడు) కల్లు ఇప్పుడు ఎంతో ఫేమస్‌ . ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కల్లుగా ఇది పేరుగాంచింది. ప్రాచీన కాలంలోనే ఎంతో ఆదరణ ఉన్న మధుపానంగా దీనికి పేరుంది. కాగా, గిరకతాడు కల్లు గీసే గిరిజనులు సైతం అత్యంత నియమ నిష్టలు పాటిస్తూ దీనిని సేకరిస్తుండడం విశేషం. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ నుంచి నామాలపాడు వరకు బయ్యారం పెద్ద చెరువు ఉంది. దీనిని కాకతీయులు నిర్మించారు. చెరువు సమీపంలోని రెండు లొద్ది ప్రాంతాల్లో జీలుగ చెట్లున్నాయి. వీటిని స్థానికులు గిరకతాళ్లు అంటారు. పూర్వం ఒక్కో చెట్టు నుంచి రోజుకు వందల లీటర్ల కల్లు రావడంతో అప్పట్లో చెట్టుపైనే గిరక ఏర్పాటు చేసి తాడు సహాయంతో పెద్ద పెద్ద కల్లు కుండలను కిందికి దింపేవారు. దీనివల్లే గిరకతాడు అనే పేరు వచ్చింది. గిరక తాటి కల్లుకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఏటా డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఈ కల్లు లభిస్తుంది. ఒక్కో చెట్టుకు రోజూ 30 నుంచి 50 సీసాల కల్లు వస్తుండడంతో స్థానిక గిరిజన కుటుంబాలకు ఉపాధి మార్గంగా మారింది. గిరక తాటి కల్లులో ఔషధ గుణాలు మెండుగా ఉండడంతో చుట్టు పక్కల గ్రామాల వారే కాకుండా ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాల నుంచీ ప్రత్యేకంగా వచ్చి కల్లు తాగి వెళ్తుంటారు. కల్లు తాగిన ప్రతి ఒక్కరూ 'మస్తు మజాగా ఉంది' అని కొత్త అనుభూతికి లోనవుతారు. కల్లు కావాల్సిన వారు వారం ముందుగానే బుక్‌ చేసుకోవాలి. సాధారణంగా కల్లు తాగితే గ్యాస్ట్రిక్‌, అల్సర్‌ వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ గిరకతాటి కల్లు తాగితే ఎలాంటి సమస్యలూ రావని, కిడ్నీలో ఉన్న చిన్నసైజు రాళ్లు పోతాయని, చర్మ వ్యాధుల సమస్యల దూరమ వుతాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు.

పూర్వం నుంచే సాకీ పానంగా ప్రసిద్ధి

నీటి ప్రవాహం అధికంగా ఉండి బుడుగు లాంటి ప్రాంతంలోనే గిరకతాటి చెట్లు జీవిస్తాయి. వీటి ద్వారా లభించే కల్లుకు పూర్వం నుంచే ఔషధ గుణాలు కలిగిందిగా పేరున్నది. కాకతీయ రాజులు కన్నడ దేశం నుంచి ఈ గిరక తాటి మొక్కలు తీసుకొచ్చి చెరువులు తవ్వించిన ప్రాంతాల్లో నాటేవారని, క్రమేణా చాలా చోట్ల కనుమరుగై కొన్ని చోట్లనే మిగిలాయని పూర్వీకులు చెబుతుంటారు. ఈ చెట్లను కాకతీయ రాజులు ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేసేవారని ప్రతీతి. గిరకతాటి కల్లును సాకీ పానం పిలిచేవారు. పూర్వం ఆయుర్వేద వైద్యంలోనూ గిరక తాటి కల్లును ఉపయోగించినట్లు కాకతీయుల చరిత్రను తెలిపే పలు పుస్తకాల్లో ఉన్నది. కాకతీయుల చరిత్రలో ప్రత్యేకంగా గిరకతాటి చెట్ల గురించి ప్రస్తావించారంటే వీటి విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు.

గీసే విధానంలోనూ ప్రత్యేకత

గిరక తాటిచెట్టును గీసే విధానంలోనూ అనేక ప్రత్యేకతలున్నాయి. కల్లు తీసే గిరిజనులు ఎంతో నియమనిష్టలతో చెట్ల వద్దకు వెళ్తారు. ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాతనే చెట్టెక్కి కల్లు గీస్తారు. కొన్ని ఆహార నియమాలు కూడా పాటిస్తారు. ఇతరులు చెట్టును తాకకుండా జాగ్రత్త పడుతారు. ఒకవేళ ఎవరైనా ఇతరులు చెట్టును తాకితే కల్లు పారదని, చెట్టు ఎండిపోతుందని భావిస్తుంటారు. తాటిచెట్టుకు భిన్నంగా గిరక తాడు గెలలు వేస్తుంది. తాటిచెట్టు ఎదిగిన తర్వాత చుట్టూ గెలలు వేస్తే, గిరక తాడుకు పైనుంచి ఒక్కో గెల కిందకు వేలాడుతూ ఒక దాని తర్వాత మరొకటి మాత్రమే కల్లును ఉత్పత్తి చేస్తుంది. తాటిచెట్టును గౌడన్నలు ముస్తాదు ద్వారా ఎక్కితే గిరక తాడును వెదురు బొంగు కొయ్యల ఆధారంగా ఎక్కుతుంటారు. గిరకతాటి కల్లుతో పూర్వం బెల్లాన్ని కూడా తయారు చేసేవారు.

పవిత్రంగ ఉండాలె

స్నానం చేసినంకనే చెట్టు ఎక్కాలె. చెట్టుకాడికి పవిత్రంగ పోవాలె. ఆపవిత్రంగ ఉండి తాకితే కల్లు పారదు. చెట్టు ఎండిపోతది. మా తాత ముత్తాతల నుంచి గిరక తాటి కల్లు అమ్ముతున్నం. నేను నలభై ఏండ్ల నుంచి గీస్తున్న. కిడ్నీ, చర్మ వ్యాధులు ఉన్నవాళ్లకు ఈ కల్లు బాగా పనిచేస్తది.

Author Image
AboutAUTHOR..

Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment